హైదరాబాద్ : పాలకుర్తి నియోజకవర్గ బిఆర్‌ఎస్ కీలక నాయకుడు, మాజీ శాసనసభ్యుడు నెమురుగొమ్ముల సుధాకర్‌రావుకు సిఎం కెసిఆర్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు. రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా నియమిస్తూ సోమవారంనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వతహాగా వైద్యుడు అయిన సుధాకర్‌రావుకు ఆరోగ్యశ్రీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తమవుతోంది. సుధాకర్‌రావు 1999 నుంచి 2004 వరకు ఎంఎల్‌ఎగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2010 తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరారు. 1975 నుంచి వైద్యుడిగా సామాన్య ప్రజలకు సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎంఎల్‌ఎగా పనిచేసిన సమయంలో అనేక మంది నిరుపేదలకు శాశ్వత గృహ వసతులు కల్పించారు. నియోజకవర్గంలో సుమారు 35 ఓవర్ హెడ్ ట్యాంకులు ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. నియోజకవర్గంలో చేసిన పనులలో ముఖ్యమైంది శ్రీరాంసాగర్ కాలువ మైలారం రిజ్వర్వాయర్ నుండి ఒక 1 కి.మీ. కు 1 కోటి 50 లక్షలతో, 35 కి.మీ.లు పాలకుర్తి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం. దీనివలన కొడకండ్ల రిజ్వర్వాయర్, మరి కొన్ని చెరువులు నింపడానికి ఉపయోగపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *