న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక సీన్ ఢిల్లీకి మారింది. ఈ రోజు సాయంత్రం లోపు సీఎంపై ఒక స్పష్టత ఇస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దాదాపు పీసీసీ చీఫ్ రేవంత్ పేరే ఖరారు అయినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న భావన ఉంది. మరోవైపు సీనియర్ నేతలు, సీఎం సీటు ఆశిస్తున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ లను అధిష్టానం హస్తినకు రావాలని ఆదేశించింది. దీంతో ఇద్దరు నేతలు ఢిల్లీ పయనమై వెళ్లారు. నిన్న సోమవారంనాడు హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో ఏకవాక్య తీర్మానం చేసిన సీఎల్పీ ముఖ్యమంత్రి పేరును ఎంపిక చేసే బాధ్యతలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించింది. సీఎం, మంత్రులు, శాఖల అంశంలో నేతల నడుమ కొంత పట్టువిడుపులు లేకపోవడంతో కాంగ్రెస్ పరిశీలకులు డీకే శివకుమార్ తప్పని పరిస్థితుల్లో సీన్ ఢిల్లీకి మార్చారు. మంగళవారంనాడు ఉదయం ఆయనతో పాటు మిగతా పరిశీలకులు ఖర్గేను కలిసి సీఎల్పీ తీర్మానం కాపీని అందజేయనున్నారు. అయితే రేవంత్ రెడ్డివైపు అత్యధికులు మొగ్గు చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆయనకు సీఎం సీటు ఇస్తే తమకు కావాల్సిన శాఖలు, డిప్యూటీ సీఎం పదవులపై భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి తదితరులు పట్టుబట్టినట్లు తెలిసింది. ఏది ఏమైనా మంగళవారంనాడు సాయంత్రం కల్లా సీఎం పదవిపై ఒక క్లారిటీ రానుంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏడో తేదీని ఉండనున్నట్లు తెలిసింది.
కొత్త మంత్రులు వీరేనా..?
మరోవైపు తెలంగాణలో కొత్త మంత్రులపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ సాగర్, వివేక్, కరీంనగర్ నుంచి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, రేవూరి, నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ, ఖమ్మం నుంచి పొంగులేటి, పోదెం వీరయ్య, తుమ్మల ఉన్నారు. ఇక నల్గొండ నుంచి ఉత్తమ్ తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశావహులుగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అయితే స్పీకర్ పదవికి దుద్దిళ్ల ఆసక్తి చూపకపోవడంతో తుమ్మల వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *