హైదరాబాద్ : వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు గా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సిఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రేపు (సోమవారం) నాడు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం ఆదేశించారు. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, ఈ విధానాన్ని అనుసరించే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని సిఎం వివరించారు. రాష్ట్రంలో వీఆర్ఏ ల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ.జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి,మదన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నేతలు చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జెనరల్ దాడే మీయా, విజయ్ రవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *