న్యూఢిల్లీ : భారతావని సహా యావత్ శాస్ర్త సాంకేతిక ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నమధుర గడియలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపేందుకు సిద్ధమవుతోంది. ఇస్రో ప్రకటన ప్రకారం బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్రో పరిశోధకులతో కలిసి వర్చువల్ గా వీక్షించనున్నారు. ఈ మేరకు కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ సురక్షితంగా జరిగేలా అన్ని వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నామని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ ప్రయోగం ఇప్పటి వరకైతే సాఫీగా సాగుతోందని వివరించింది. ఇప్పటి వరకు చంద్రుడిపై విజయవంతంగా అమెరికా, రష్యా, చైనా మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించాయి. ఆ జాబితాలో భారత్ చేరుతుందా, లేదా అన్నది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే తొలి దేశంగా భారత్ అవతరించనున్నది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన తర్వాత సహజ వాతావరణంలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *