హైదరాబాద్ : జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్న రాజయ్య.. కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఆయనతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య వివాదం నడుస్తోన్న నేపథ్యంలో కేటీఆర్‌తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్‌తో సమావేశం అనంతరం ప్రగతిభవన్‌ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పిలుపు మేరకు కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. కడియం శ్రీహరితో విభేదాల గురించి కేటీఆర్‌ అడిగారని.. కడియం గురించి ఇకపై మీడియా ముందు మాట్లాడవద్దని చెప్పారని తెలిపారు. కేటీఆర్‌ తనను పిలిచి మాట్లాడటంతో సమస్య పరిష్కారమైందన్న ఆయన.. ఇకపై ఘన్‌పూర్‌లో పార్టీని పటిష్ఠ పరుస్తానన్నారు. ఈ క్రమంలోనే తల్లిని అవమానించే వారు ఎవరూ ఉండరని.. కడియం శ్రీహరి కుల వివాదం ఇప్పటిది కాదని ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యానించారు. మాదిగ దండోరా ద్వారా తాను రాజకీయాల్లోకి వచ్చానని.. మాదిగల అస్తిత్వం కోసం తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి అహంతో మాట్లాడే విధానం సరిగా లేదని.. ఆయన తనను నిత్యం వేధిస్తున్నారని ఆరోపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *