దేశ ఐక్యక, భారత సమగ్రత కోసం, పేద మధ్య తరగతి ప్రజల కోసం పోరాడుతోన్న రాహుల్ గాంధీ గారి పై మోడీ ప్రభుత్వం కక్షగట్టి ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రేపు (బుధవారం) టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా “సత్యాగ్రహ దీక్ష” పేరుతో గాంధీజీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమైన సందర్భంలో అసత్య, అసందర్భ అంశాన్ని తెర మీదకు తెచ్చి బీఆర్ఎస్ చిల్లర హడావుడి చేయడం, సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇటీవల ఖమ్మంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభలో శ్రీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ… రాష్ట్రంలో బీఆర్ఎస్ అన్నది బీజేపీకి బీ టీంగా మారిందని ఆరోపించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఈ బీ టీం బంధం ఫెవికాల్ బంధంగా బలపడిందని రేవంత్ ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా జరుగుతోన్న సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసే కుట్రలో భాగంగా బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్ అమెరికాలో తాను అనని మాటలను అన్నట్టు దుష్ర్ఫచారంలోకి తెచ్చి మోడీని కాపాడే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్న విషయం తేలిపోవడంతో బీఆర్ఎస్ మంత్రులు, నేతలు దుష్ప్రచారాలకు తెగబడ్డారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం, ఈ డిక్లరేషన్ రైతుల్లో భరోసా నింపడంతో వెన్నులో వణుకుపుట్టిన బీఆర్ఎస్ చిల్లర ప్రచారాలతో లబ్ధిపొందే కుతంత్రానికి దిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *