యాదాద్రి : యాదాద్రిలో భక్తులు అడుగుతీసి అడుగు వేయాలంటే చేతి చమురు వదులుతోంది. ఎడాపెడా రుసుములతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నరసింహస్వామి దర్శనానికన్నా అక్కడ పెట్టాల్సి వస్తున్న తప్పని ఖర్చులు భక్తులను భయపెట్టిస్తున్నాయి. కొండపైకి ఉచిత బస్సు సర్వీసులు ఉన్నప్పటికీ వాటిల్లో విపరీతమైన రద్దీతో బస్సు ఎక్కడానికే నానా తంటాలు పడాల్సి వస్తోంది. బస్సులను ఆశ్రయించలేని వారు కొండపైకి కారులో వెళ్లాలంటే జేబుకు చిల్లు పడుతోంది. పెద్దలు, చిన్న పిల్లలున్న కుటుంబాలు సర్వసాధారణంగా కారులో దర్శనానికి వెళతారు. అయితే కొండపైకి కారు తీసుకెళితే అక్కడ పార్కింగ్ చార్జి ఏకంగా రూ.500 వసూలు చేస్తున్నారు. దీంతో ఈ చార్జీలు తమకు భారంగా మారాయని పలువురు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దైవ దర్శనానికి వస్తే ఇదే దోపిడీయని, ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని, భక్తులకు చార్జీలను అందుబాటులో ఉండేలా చూడాలని వేడుకుంటున్నారు. మంత్రి కేటీఆర్, దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వినతులు పంపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *