హైదరాబాద్ : మహారాష్ట్ర తో తెలంగాణ ది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి వున్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. అట్లాంటి అనుబంధమున్న మహారాష్ట్ర నుంచే బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడం తనకెంతో ఆనందంగా వున్నదన్నారు. తొమ్మిదేండ్ల అనతి కాలంలో తెలంగాణ లో సాధించిన అభివృద్ధి సంక్షేమం భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ ఇదే స్పూర్తితో మహారాష్ట్రను కూడా ప్రగతి పథంలో నడిపించుకుందామని మహారాష్ట్ర ప్రజలకు సిఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతూనే వున్న నేపథ్యంలో శనివారం నాడు సోలాపూర్, నాగపూర్ తదితర ప్రాంతాలనుంచి పలువురు నేతలు ప్రముఖులు తెలంగాణ భవన్ లో అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి అధినేత సిఎం కేసీఆర్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘‘ భారత దేశం లో ప్రస్థుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయి. తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ పదవుల కోసం ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు ఆ పార్టీలనుంచి ఈ పార్టీలకు జంపులు చేస్తున్నరు. మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న సంఘటనలను దేశ ప్రజలు గమనిస్తున్నరు..’’ అని సిఎం అన్నారు. ఈ దేశం యువతీయువకులదని,. ఎంతో భవిష్యత్తు వున్న యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాల్సి వుంది. పరివర్తన చెందిన భారత దేశంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపిన సిఎం కేసీఆర్, దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత యువత మీదనే ప్రధానంగా వున్నదని స్పష్టం చేశారు. నాటి భగత్ సింగ్ అల్లూరి వంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేసే దిశగా భాగస్వాములు కావాల్సి వుంది’ అని పిలుపునిచ్చారు.
ఇతర దేశాలు ఎట్లా అభివృద్ది చెందుతున్నాయి మనం ఎందుకు ఇంకా వెనకబడే వున్నమనే విషయాన్ని,. దేశ పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరమం ప్రతి వొక్కరిమీదున్నదని సిఎం అన్నారు. తాను చెప్తున్న విషయాలను గర్తుంచుకుని, గ్రామాలకు వెల్లినంక కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి చర్చించుకోవాల్సిన అవసరమున్నదన్నారు. దేశంలో అవసరానికి మించి అందుబాటులో వున్న నదీ జలాలు తదితర సహజసంపదను, 75 ఏండ్లు గడిచినా ఈ దేశ పాలకులు ఇంకా సరియైన రీతిలో వినియోగంలోకి ఎందుకు తేలేకపోతున్నారనే విషయాన్ని ఆలోచించాలన్నారు. ప్రపంచంలో మొన్నటి దాకా వెనకబడిన చైనా వంటి దేశాలు నేడు మనం అందుకోలేని స్థాయిలో అభివృద్ధి చెందాయని సోదాహరణలతో వివరించారు. కేంద్ర పాలకులకు దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు సరియైన రీతిలో లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సభ్య దేశాల ముంగట అంతర్జాతీయ మార్కెట్లో భారత దేశ ఇజ్జతి ని కాపాడుకోవాల్సి వుందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *