హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా వున్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడివున్నదన్నారు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అలసత్వం వహించకూడదని, తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే వుండాలని సిఎం ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో.. తమ నాలుగు సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేషించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం. మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల బాధ్యతలను చేపట్టాలనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారికి విధిగా నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో తమ ప్రొబేషన్ పీరియడ్ ను పూర్తి చేసుకున్న కార్యదర్శులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్థేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న వారికి రెగ్యులరైజ్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశం లో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *