హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీ-డయాగ్నోస్టిక్స్‌ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటివరకు టీ-డయాగ్నోస్టిక్స్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా 57 రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టెస్టుల సంఖ్యను 134కు పెంచారు. దీంతోపాటు కొత్తగా 8 జిల్లాల్లో పాథాలజీ ల్యాబులు, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబులు సిద్ధమయ్యాయి. ఈ సేవలను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ఏరియా దవాఖాన నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేట్‌ ల్యాబుల్లో రూ.500 నుంచి రూ.10వేల వరకు ఖరీదు చేసే పరీక్షలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానపై నమ్మకంతో వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ టీ-డయాగ్నోస్టిక్స్‌కు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 2018 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానల్లో ఉచిత పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 57 రకాల పాథాలజీ (రక్త, మూత్ర) పరీక్షలతోపాటు, ఎక్స్‌రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఈకో, మామోగ్రామ్‌ వంటి రేడియాలజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *