హైదరాబాద్ : లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు బాట సింగారం వెళుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే వర్షం
కురుస్తున్నా కిషన్ రెడ్డి బైఠాయించారు. కాసేపు పోలీసులు సర్ది చెప్పినా వినకపోవడంతో అరెస్ట్ చేసి ఆయనను పోలీసులు కారులో తరలించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసే రీతిలో తీసుకున్న ఈ చర్య బీఆర్ఎస్ పార్టీ భయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోని ప్రతి కుటుంబం యొక్క కలలను నెరవేర్చే దిశగా నరేంద్రమోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని,.ఇంకా ఎన్ని ఇళ్లు కావాలన్నా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అయినప్పటికీ పేద ప్రజల గోడు పట్టని కేసీఆర్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తోందని దుయ్యబట్టారు.
సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది పేదలకు అండగా బిజెపి తెలంగాణ నేడు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అన్న విషయం బట్టబయలైందన్నారు. ఇదిలావుండగా ఎంఎల్ఎ రఘునందన్ రావు సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *