హైదరాబాద్ : అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు దేశవ్యాప్తంగా నీటి రంగ నిపుణులు, పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, మేధావులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే క్యూ కడుతున్నారు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ఆకర్షితులై మహారాష్ట్రకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం కేసీఆర్ గారి సూచన మేరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారథ్యంలో టిఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల వంశీధర్ రావు మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకుల బృందం కాళేశ్వరం ప్రాజక్టును సందర్శించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు మ్యాపు ఆధారంగా మహారాష్ట్ర నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను వివరించారు. నీటి ఎత్తిపోస్తున్న తీరు, పంపుల సామర్థ్యం, వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలను వారికి వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ తెలంగాణ వ్యవసాయ భూములకు సాగునీటిని అందిస్తున్న తీరును మ్యాపుల ఆధారంగా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యాచరణను, సీఎం కేసీఆర్ దార్శనికతను నాయకులు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని వారు కొనియాడారు. సాగునీటిరంగంతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ సాధిస్తున్న ప్రగతి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తీరుతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ బాటలో పయనిస్తున్నాయని వారన్నారు.

తన జీవితంలోనే ఇంతటి గొప్ప ప్రాజెక్టను చూడలేదని మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భానుదాస్ మార్కుటే అన్నారు. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాజెక్టును చూడబోమని అన్నారు. 32 దేశాలను తిరిగిన తాను ఇలాంటి మానవ నిర్మిత అద్భుతాన్ని ఎక్కడా చూడలేదని అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని ప్రశంసించారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టును కళ్ళారా చూసిన తన జన్మ ధన్యమైందని భానుదాస్ మార్కుటే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *