ఢిల్లీ : సరిహద్దులు దాటి ప్రేమ కోసం భారత్ కు చెందిన వ్యక్తి కోసం వచ్చేసిన పాక్ మహిళ సీమా హైదర్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఆమె కారణంగా భారతదేశానికి బెదిరింపులు కూడా వస్తున్నాయి. సీమాను తిరిగి పాకిస్థాన్ కు పంపించకపోతే భారత్ భారీ విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక బెదిరింపు కాల్ వచ్చింది. గత బుధవారంనాడు ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు ఈ కాల్ వచ్చినట్లు గుర్తించారు. భారత్ లోని ప్రతి ఒక్కరు ముంబై తరహా (26/11) దాడులకు సిద్ధంగా ఉండాలని ఆ ఫోన్ కాల్ సారాంశం. దీనికి యూపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా కాలర్ బెదిరించారు. దీనిపై సైలెంట్ గా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని తీవ్రత ఎంత అన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. సీమ పాక్ లోని సింధు ప్రావిన్స్ వాసి. గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ తో పబ్జీ గేమ్ లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో సీమా నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో భారత్ కు అక్రమంగా చేరుకుంది. సచిన్ ను వదిలి తాను ఉండలేనని, ఒక వేళ వెళ్లగొడితే తనకు చావే దిక్కని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *