వరంగల్ : ఈనెల 8న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’ అని నామకరణం చేశారు. ఆరోజు ఉదయం 9 గంటలకే మోదీ హన్మకొండ
సభకు విచ్చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. దాదాపు 15 లక్షల జన సమీకరణే లక్ష్యంగా బహిరంగ సభను నిర్వహించి ఓరుగల్లును పోరుగల్లుగా మార్చి చరిత్ర స్రుష్టిస్తామని
చెప్పారు. కనివీనీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారంనాడు మధ్యాహ్నం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఎస్వీ కన్వెన్షన్
హాలులో ‘‘సన్నాహక సమావేశం’’ జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రులు మర్రి శశిధర్ రెడ్డి,
జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి క్రిష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ
సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో రాహుల్ గాంధీతో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభకు లక్షల మంది జనాన్నీ సమీకరించిందని, ఉనికే లేని కాంగ్రెస్ పార్టీయే అంత
జనాన్ని తీసుకొస్తే… బీఆర్ఎస్ కు అసలు సిసలైన బీజేపీ నిర్వహించబోయే అందునా ప్రధాని నరేంద్రమోదీ హాజరుకాబోయే బహిరంగ సభకు ఇంకెన్ని లక్షల మంది జనాన్ని సమీకరించాలో ఆలోచించాలన్నారు. 15
లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేసి ఓరుగల్లును పోరగల్లుగా మార్చి చరిత్ర లిఖిద్దాం అని సంజయ్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *