న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్ అంటేనే వాక్ స్వాతంత్ర్యం అని,  ఇప్పుడు ఆ గొంతుకను నొక్కి పడేశారని మండిపడ్డారు. మణిపూర్ లో దాన్ని పూర్తిగా చంపేశారని.. ఏకంగా భారత మాతనే అక్కడ  మీరు హత్య చేశారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  అక్కడ చెలరేగిన హింసలో మీరే పెద్ద కుట్రదారులని దుయ్యబట్టారు.  మణిపూర్ లో ప్రధానమంత్రి మోడీ ఇప్పటి వరకు ఎందుకు పర్యటించలేకపోయారని అన్నారు. మీరు రక్షకులు కాదు.. భక్షకులు అని రాహుల్ మండిపడ్డారు. అసలు హంతకులు మీరేనని ఆక్షేపించారు. మణిపూర్ భారతదేశంలో భాగం కాదని మోడీ భావిస్తున్నారని, అందుకే అక్కడ శాంతి నెలకొల్పేందుకు..పర్యటించేందుకు వెనకాడారని అధికార పక్ష సభ్యుల అరుపులు..కేకల నడుమ ధ్వజమెత్తారు. సైన్యం తలచుకుంటే మణిపూర్ శాంతి నెలకొల్పడం గంటల పని అని, దాన్ని ఎందుకు అడ్డుకున్నారని  ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లే మణిపూర్ లో మారణహోమం జరిగిందన్నారు. మణిపూర్ ను బీజేపీ రెండు ముక్కలు చేసిందన్నారు.  మణిపూర్ పర్యటనలో బాధితులను కలిశానని, వారి బాధలు విని గుండెతరుక్కుపోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామాయణంలోని పలు సంఘటనలను గుర్తు చేశారు. రావణుడు రాముడి చేత చంపబడలేదని, కానీ అతని అహంకారమే అతన్ని చంపేసిందన్నారు. మీరు దేశంలో ఎక్కడ పడితే అక్కడ కిరోసిన్ చల్లారని, మణిపూర్ లో మంటలు చెలరేగాయని, ఇప్పుడు అదే పనిని హర్యానాలో చేస్తున్నారని దుయ్యబట్టారు. తాజా గురుగ్రామ్, నుహ్ అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ఎన్డీఏ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మ`తి ఇరానీ మాట్లాడుతూ మీది ఇండియా కాదు అని, అవినీతికి నిర్వచనమని ఎదురుదాడికి దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *