హైదరాబాద్ ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ‘ఆరు’ గ్యారెంటీల పేరుతో కొన్ని కీలక పథకాలను ప్రకటించి అనధికారికంగా తమ మేనిఫెస్టోను ప్రకటించినట్లయింది. ఇక బీజేపీ కూడా తమ మేనిఫెస్టో కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అయితే వీటన్నింటిని పక్కకు పెడితే అధికార భారత రాష్ట్ర సమితి 15వ తేదీన.. అంటే ఆదివారంనాడు ప్రకటించబోయే మేనిఫెస్టో పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ పండితులు, విశ్లేషకులు, ఆయా పార్టీల నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎవరూ ఊహించని రీతిలో బీఆర్ఎస్ కీలక సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, దళితబంధు తదితర పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. అయితే రైతుబీమా, పింఛన్ల మొత్తాన్ని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంత మేరకు పెంచబోయేది ఈ సారి ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ ఎస్ స్పష్టత ఇవ్వనుంది. వాటిపై ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సూచనప్రాయంగా కూడా వెల్లడించారు. వాటి మొత్తాన్ని మరింతగా పెంచి లబ్ధిదారులకు అందించనున్నామని, ఆ శుభవార్త స్వయంగా కేసీఆరే చెబుతారని కూడా పలు సభలు, మీడియా సమావేశాల్లో ప్రకటించారు. పింఛన్లు నెలకు రూ.4వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, మేం ఐదువేలు అని ఐదేళ్లు చూపించలేమా అని ఇప్పటికే ఆ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు, బాధత లేని హామిలిచ్చేందుకు వాళ్లకేమన్నా నెత్తా కత్తా అని కాంగ్రెస్ పై విమర్శలు కూడా గుప్పించారు. అయితే రైతుబంధు, పెన్షన్ల మొత్తం పెంపు ఇవన్నీ సర్వసాధారణమేనని, పాత పథకాలకే మెరుగులు అద్దితే ప్రజలు పెద్దగా పట్టించుకునే అవకాశాలు ఉండకపోగా.. ఇతర పార్టీల మేనిఫెస్టోలతో బేరీజు వేసుకోవడమే కాకుండా వాటిపై చర్చకు కూడా దారిచ్చినట్లవుతుందని బీఆర్ఎస్ అధినేత ఆలోచనగా ఉంది. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా ప్రజల్లో కేవలం బీఆర్ఎస్ మేనిఫెస్టోపైనే చర్చ జరిగేలా కేసీఆర్ కొత్త పథకాలకు రూపకల్పన చేసినట్లు సమాచారం. అదే సమయంలో రాష్ట్ర బడ్జెట్.. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొత్తగా ఇవ్వబోయే హామీల అమలుకు నడుమ సమన్వయం కుదిరేలా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగానే హామీలున్నాయని బీఆర్ఎస్ పట్ల ప్రజలను ఒప్పించగలమన్న విశ్వాసంతో ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఊహకందని హామీలిచ్చి ఇప్పుడు వాటి అమలుకు అపసోపాలు పడడమే కాకుండా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తీరును బీఆర్ఎస్ నేతలు ఉదహరిస్తూనే కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్లో పలుచన కావడం కన్నా అమలుకు అవకాశమున్న వాటినే మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజల్లో ఆ పథకాల పట్ల సానుకూల చర్చ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తమ మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని పదేపదే వ్యాఖ్యానించడం చూస్తుంటే కేసీఆర్ ఏదో బ్రహ్మాస్త్రాన్ని విపక్షాలపై సంధించబోతున్నారని స్పష్టమవుతోంది. విపక్షాల ఊహకందని పథకాలు ఏవో రాబోతున్నాయన్న చర్చ కూడా ప్రజా బాహుళ్యంలో సాగుతోంది. రైతులకు ఉచితంగా పరిమిత పద్ధతిలో ఎరువులను అందజేసే పథకం అధినేత మదిలో ఉన్నట్టు తెలుస్తోంది. పథకాల వ్యూహరచనలో కేసీఆర్ దిట్ట.. ప్రజాప్రతినిధుల కేంద్రంగా కాకుండా ప్రజలే కేంద్రంగా ఆయన పథక రచన చేస్తుంటారు. ఇప్పటికే రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలెన్నింటినో అమలు చేసిన ఘనత సొంతం చేసుకుంది. వాటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కూడా లభించింది. వాటినే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు చూస్తునే ఉన్నాం. రైతుబంధు, మిషన్ భగీరథ తదితర పథకాలు ఆయా రాష్ట్రాలు పేర్లు మార్చి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *