పెంబర్తి.. జనగామ జిల్లాలోని ఈ గ్రామం పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది హస్తకళలు. అక్కడ ఏ వీధికెళ్లిన లయబద్ధంగా లోహాలపై పడుతున్న సుత్తి దెబ్బలు వీనులవిందు చేస్తుంటాయి. ఉలుల శబ్ధం ఊరులో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆ గ్రామస్థుల చేతిలో ఇత్తడి, పంచలోహాలలో పురుడుపోసుకున్న హస్తకళా ఉత్పత్తులు చక్కున మెరుస్తుంటాయి. కళ్లకు కనుల విందు చేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా పెంబర్తి గ్రామానికి కీర్తి కిరీటాన్ని తొడిగిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ మరోసారి పెంబర్తి గురించి చర్చించుకుంటున్నారు. ఆ గ్రామం ప్రాముఖ్యత ఏంటీ అన్నదానిపై తరచి చూస్తున్నారు. పెంబర్తి గ్రామం హైదరాబాద్-వరంగల్ హైవేపై ఉంటుంది. ఏ బస్సు ఎక్కిన సరిగ్గా గ్రామంలోనే దిగే సౌకర్యం ఉంది. పెంబర్తిలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. జనగామ జిల్లా కేంద్రానికి నాలుగైదు కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 80 కి.మీ దూరంలో ఉంటుంది. ఉప్పల్ నుంచి హైవేపై వెళుతుంటే ఈ గ్రామం దాటిన తర్వాతే జనగామ వస్తుంది. వరంగల్ నుంచి 65 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి పెంబర్తి వెళ్లాలంటే హైదరాబాద్ బస్సు లేదా రైలు ఎక్కాల్సి ఉంటుంది. జనగామ దాటిన తర్వాత ఈ గ్రామం వస్తుంది. ఈ గ్రామంలోకి ప్రవేశించగానే హస్తకళలతో తయారు చేసిన జాపికలు, మెమెంటోలు, ఇత్తడి సామాగ్రితో తయారు చేసిన కళా ఖండాలు.. దేవాలయాల కోసం తయారు చేసిన రకరకాల సామాగ్రి, దేవీ దేవతల విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. పెంబర్తిలో తయారు చేసిన కళాఖండాలు భారత్ లోనే కాకుండా విదేశాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అమెరికాలోని పలు ఆలయాలకు కూడా ఇక్కడి నుంచే దిగుమతి చేసుకున్నారు. జపాన్, జర్మనీ, బెల్జియం తదితర దేశాలు కూడా పెంబర్తి కళాక్రుతులను దిగుమతి చేసుకున్న దేశాల్లో ఉన్నాయి. వారికి కావాల్సిన కళాఖండాలను కస్టమర్లు కోరుకున్న రకాల డిజైన్లలో మలిచి ఆయా ఉత్పత్తులను తయారు చేయడంలో పెంబర్తి కళాకారులు నిష్ణాతులు. ఇక్కడ పురుడుపోసుకునే
ఉత్పత్తులు 50 రూపాయల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు కూడా ఉంటాయి.
పెంబర్తి కళాకారుల చరిత్ర ఈ నాటిది కాదు..
ఈ గ్రామ హస్తకళా నైపుణ్యులు ఎంత గొప్పవారంటే నిజాం నవాబుల కన్నా ముందే వంట పాత్రలు తయారు చేసే వారు. అప్పట్లో విశ్వకర్మ కుటుంబీకులదే వీటి తయారీలో పెంబర్తిలో ప్రముఖ పాత్ర ఉండేది. రానురాను
విశ్వకర్మ కుటుంబాలు వివిధ రకాల వ్రుత్తులకు మళ్లడంతో ఉపాధి కోసం మిగతా వర్గాలు కూడా హ్యాండీక్రాఫ్ట్స్ వైపు మళ్లడంతో ఇప్పుడు అన్ని వర్గాల సమ్మేళనంగా తయారైంది. వేములవాడ రాజన్నకు వెండి
ద్వారాలు, బాసర, శ్రీకాళహస్తి ధ్వజ స్తంభానికి తొడుగులు.. ఈ ఆలయాలే కాక ఇటీవల పోతన, పాల్కుర్కి సోమనాథుడు, ప్రాచీన కవుల స్మ`తి వనాలకు నిర్మాణాల్లో పెంబర్తి హస్తకళా నిపుణులు తమ వంతు పాత్ర
పోషించారు. పాలకుర్తి, వల్మిడీ, బమ్మెర ఆలయాల్లోనూ వివిధ ఆక్రుతులు వీళ్లు మలిచినవే కావడం విశేషం. పంచలోహాలతో తయారు చేసే ఏ దేవతలకు సంబంధించిన విగ్రహాలైనా పెంబర్తిలో అద్భుతంగా
రూపుదిద్దుకుంటాయి.
ఏడాదికి ఎంత మంది…
హస్తకళల కాణాచిగా విరాజిల్లుతున్న పెంబర్తిని ప్రతి ఏటా వేలాది మంది సందర్శిస్తారు. వారికి కావాల్సిన ఉత్పత్తుల కోసం దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి రావడం పరిపాటి. ప్రతి సంవత్సరం కనీసం 20
నుంచి 30 వేల మంది పెంబర్తిని సందర్శిస్తారు. వారికి కావాల్సిన ఉత్పత్తుల కోసం ఆరా తీయడం.. కావాల్సినవి తయారు చేయించుకుని వెళుతుంటారు. తమ హస్తకళా ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తం కావాలంటే
ప్రభుత్వాల ప్రోత్సాహం మరింత కావాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక నైపుణ్యాన్ని సమకూర్చకోవాల్సిన అవసరం ఉందని, ఖర్చుతో కూడుకున్నది అయినందున ప్రభుత్వం ముందుకు
వచ్చి తమకు సాయం చేయాలని విన్నవిస్తున్నారు. అదే విధంగా పనుల్లో నిమగ్నమై గంటల కొద్దీ పనులు చేస్తుండడం వల్ల కార్మికులు నిపుణులు అనారోగ్యం పాలవుతున్నారని, వారి చికిత్సకు కూడా ప్రభుత్వం
ముందుకు రావాలని కోరుతున్నారు. హస్తకళలకు పుట్టినిళ్లుగా పేరుగాంచిన పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి గ్రామ సర్పంచి అంబాల ఆంజనేయులు గౌడ్ గ్రామస్థుల తరపున
హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత వెనక గ్రామస్థులతో పాటు కళాకారుల నైపుణ్యం దాగివుందని అభినందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *