న్యూఢిల్లీ : భారత్ కు చెందిన మరో శాస్త్రవేత్త పాకిస్థాన్ నిఘా విభాగం వలలో పడ్డారు. అత్యంత కీలకమైన క్షిపణి వ్యవస్థకు సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించాడు. అతడే డీఆర్డీఓకు చెందిన ప్రదీప్ కురుల్కర్ అనే సైంటిస్టు. ఈయన డీఆర్డీఓ ల్యాబ్స్ విభాగం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. జరా దాస్ గుప్తా పేరిట ప్రదీప్ తో చాట్ చేసిన పాక్ నిఘా విభాగం అధికారిణి పలు కీలక విషయాలను రాబట్టుకున్నట్టు సమాచారం. మహారాష్ర్ట ఏటీఎస్ పోలీసులు ప్రదీప్ పై చార్జిషీటు దాఖలు చేశారు. మే 3నే ప్రదీప్ ను అరెస్ట్ చేసినట్లు ఆలస్యంగా వెల్లడించారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ప్రదీప్, దాస్ గుప్తా వాట్సాప్ చాటింగ్ చేయడమే కాకుండా వీడియో కాల్స్ కూడా చేసుకున్నారని పోలీసులు వివరించారు. యూకేలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్న దాస్ గుప్తా పలు రకాల అసభ్య సందేశాలను పంపి ప్రదీప్ కురూల్కర్ ను వలలో వేసుకున్నట్టు తేలింది. విచారణలో దాస్ గుప్తా ఐపీ అడ్రస్ పాక్ లో ఉన్నట్లు తేలిందని ఏటీఎస్ దాఖలు చేసిన చార్జిషీట్ లో పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రాబట్టేందుకు పాక్ ఏజెంట్ ప్రయత్నించినట్లు తెలిపారు. ‘ఆమెకు ఆకర్షితుడైన కురుల్కర్ డీఆర్డీఓకు సంబంధించిన సమాచారాన్ని తన వ్యక్తిగత ఫోన్ లో భద్రపరుచుకుని ఆమెకు చేరవేశాడు’ అని చార్జిషీటులో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *