అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి భారీ ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో 50రోజులకుపైగా జైలులో ఉంటున్న ఆయనకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లికార్జున రావు తీర్పు వెలువరించారు. అనారోగ్య కారణాలు, కంటి ఆపరేషన్ కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అనుబంద పిటిషన్ విచారణ పూర్తి చేసిన హైకోర్టు మంగళవారంనాడు ఉదయం తీర్పు వెలువరించింది. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించవద్దని కోర్టు కండీషన్ విధించింది. కుటుంబ సభ్యులకు మాత్రమే ఆయనతో గడిపే అవకాశాన్ని కల్పించింది. ఏ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు… తదితర వివరాలను సమర్పించాలని సూచించింది. నిత్యం ఇద్దరు పోలీసు అధికారులు చంద్రబాబు కదలికలను పర్యవేక్షించాలని సూచించింది. మరోవైపు నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టు విచారణ జరపనుంది. సెప్టెంబర్ 9న స్కిల్ స్కామ్ కేసులో నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే గడపాల్సి వస్తోంది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా పటాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *