న్యూఢిల్లీ : కశ్మీరీ వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్ హఠాత్తుగా న్యాయస్థానంలో ప్రత్యక్షం కావడంపై సుప్రీంకోర్టు అసంత`ప్తి వ్యక్తం చేసింది. తాము ఎలాంటి ఆదేశాలివ్వకుండానే ఆయనను ఎలా తీసుకువచ్చారని అసహనం వ్యక్తం చేసింది. 1989లో నలుగురు ఐఎఎఫ్ అధికారుల హత్య, అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురు రుబయ్యా సయీద్ కిడ్నాప్ సంబంధిత కేసుల్లో జమ్మూ ప్రత్యేక కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. ఈ కేసు విషయంలో సాక్షుల హాజరుకు కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే శుక్రవారంనాడు తీహార్ జైలు అధికారులు భారీ భద్రత నడుమ యాసిన్ మాలిక్ ను కోర్టుకు తీసుకువచ్చారు. అయితే దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు తెలియజేశారు. ఎలాంటి ముందుస్తు ఆదేశాలు లేకుండా హై రిస్క్ ఖైదీని ఎలా బయటికి తీసుకువస్తారని, ఇది అత్యంత భద్రతా పరమైన సమస్య అని పేర్కొన్నారు. మరొక సారి జైలు సిబ్బంది ఇలా వ్యవహరించకుండా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. జైలు సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా మాలిక్ ను బయటకు తీసుకువచ్చారని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను తప్పుదోవ పట్టిస్తున్నారని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ ఈ కేసుకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, మరో బెంచ్ దీనిని చూస్తుందని అన్నారు. అవసరమైతే యాసిన్ మాలిక్ వర్చువల్ తరహాలో విచారించవచ్చునని, ఇది అందరికి సౌలభ్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. స్పందించిన తుషార్ మెహతా తాము అందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఆయన దానిని తిరస్కరించారని బదులిచ్చారు. అనంతరం ధర్మాసనం కేసు విచారణను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. యాసిన్ మాలిక్ ప్రస్తుతం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *