బెంగళూరు/కొచ్చి :  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. బెంగళూరులోని చిన్మయ మిషన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఊమెన్‌చాందీ రెండుసార్లు కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. 27ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆయన సేవలు చిరస్మరణీయం : రాహుల్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌చాందీ కేరళ ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు రాహుల్‌ గాంధీ తన తల్లి, సీపీపీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఊమెన్‌ చాందీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఊమెన్‌చాందీ మృతిపై తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు నివాళులర్పించి, సంతాపం తెలిపారు. కేరళకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఊమెన్‌చాందీ చేసిన సేవలను కొనియాడారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా విని పరిష్కరించే కార్యక్రమం కేరళలో అద్భుతమైన ఆదరణ పొందిందని గుర్తుచేసుకున్నారు.
ప్రధాని మోదీ సంతాపం..
ఊమెన్‌చాందీ మృతిపై దేశ ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం నిబద్ధతను కలిగిన నేతను కోల్పోయిందన్నారు. నాడు తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాందీ కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు పలు సందర్భాల్లో కలిసినట్లు గుర్తుచేసుకుంటూ తన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *