న్యూఢిల్లీ : విశ్వకర్మ యోజనకు కేంద్ర మంత్రిమండలి బుధవారంనాడు పచ్చజెండా ఊపింది. ఎర్రకోట వేదికగా మంగళవారంనాడు జరిగిన 77వ  స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోడీ చెప్పినట్లుగానే  24 గంటల వ్యవధిలోనే అంటే బుధవారంనాడు విశ్వకర్మ పథకానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం సంప్రదాయ, చేతి వ్రుత్తుల వారికి వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.13వేల కోట్లు వెచ్చిస్తుంది. చేతివ్రుత్తులు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు దఫాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.  శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 స్టైఫండ్ తో మెరుగైన ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఆసక్తి ఉన్న వారికి అంటే శిక్షణ తీసుకున్న రంగంలో కొనసాగాలనుకుంటే  వడ్డీపై రాయితీ కింద మొదటదశలో రూ.లక్ష రుణం అందిస్తారు. తొలి విడత ఇచ్చిన రుణాన్నిలబ్ధిదారుడు  సద్వినియోగం చేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తే రెండో విడత కింద రూ.2లక్షల రుణం మంజూరు చేస్తారు. తీసుకున్న రుణానికి 5శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ వర్గాల్లోని సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రండుగులు, కుమ్మరి, కమ్మరి, రజకులు, క్షురకులు, పడవల తయారీదారులు, శిల్పులు, చర్మకారులు, ఎరుకలు(చాపలు అల్లిక, గంపల తయారీ), మాలలు అల్లేవారు(దండలు), టైలర్లు, బొమ్మల తయారీదారులు, మత్స్యకారుల వలలు అల్లేవారు, తాళం చెవులు తయారీ దారులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *