బెంగళూరు : కర్నాటక వేదికగా విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడం ఆ కీలక నేతకు ఇష్టం లేదట. అంతే కాదు కనీసం ఆ పేరు ప్రతిపాదించేటప్పుడు తమను కనీసం సంప్రదించలేదని, హఠాత్తుగా ఎలా ప్రకటిస్తారని కూడా ఆయన
కాస్త అలకబూనినట్లు సమాచారం. ఆయనే విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి దేశమంతటా కాలికి బలపం కట్టుకొని తిరిగిన బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఇండియా పేరు ప్రకటించగానే నితీశ్ ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు కూడా తెలిసింది. అంతటితో ఆగకుండా ఇలా ఎలా ఎవరితో మాటమాత్రమైనా చెప్పకుండా పేరు ప్రకటిస్తారని కూడా నితీశ్ బహిరంగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘విపక్షాలన్నింటిని ఐక్యం చేయడంలో ఆయన పాత్ర తోసిపుచ్చలేనింది. కానీ కూటమిని కాంగ్రెస్ హైజాక్ చేసింది. ఇది జెడియు, ఆర్జేడీలను తప్పకుండా షాక్ కు గురిచేసింది’ అని కూటమి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇండియా అనే పేరుతో కూడిన పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించగా దానికి తుదిమెరుగుల అద్ది రాహుల్ గాంధీ ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్’ గా ప్రతిపాదించినట్లు, దానికి మిగతా పార్టీలు కూడా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఇదిలావుంటే ఇండియా తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహించనున్నామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఆ సమావేశంలో కూటమి నాయకుడిని, ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *