డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో 16మంది ప్రాణాలు విడిచారు. వారిలో ఓ పోలీస్, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మురుగు కాల్వకు సంబంధించిన
వంతెన రెయిలింగ్ కు కరెంట్ సరఫరా కావడంతో ఈ దారుణం జరిగింది. చమోలి జిల్లాలోని పిప్పల్ కోటి గ్రామంలో చోటు చేసుకున్న ఈ విషాద స్థలికి హుటాహుటిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తరలివచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. వంతెనపై సెక్యూరిటీ గార్డు విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు స్థానికులు సమాచారం అందింది. దీంతో చూసేందుకు అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పంచనామా జరిపేందుకు పోలీసులు కూడా అదే సమయంలో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇదే సమయంలో మరోసారి విద్యుత్ ప్రసరణ జరగడంతో 22మందికి గాయాలయ్యాయి. అందరిని హుటాహుటీన స్థానికులు, పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ 15 మంది మరణించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియాను రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.1లక్ష ప్రకటించింది. ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. సీఎం ధామితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యవసర చికిత్స కోసం అవసరమైతే హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు సీఎం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *