హైదరాబాద్ : ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేశారు. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో  క్రెస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ కు 1,61,747 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా జలవిద్యుత్కేంద్రాలు, గేట్ల ద్వారా 1.50 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. రాత్రి వరకు అవుట్ 2 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి శ్రీశైలానికి దూరం 455 కిమీ. మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ వరద వచ్చి చేరుతుంది. ఆల్మట్టి దిగువన ఉన్న 31 టీఎంసీల నారాయణపుర (బసవ సాగర) జలాశయం గేట్లను కూడా ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు జూరాలకు విడుదల చేస్తున్నారు. జూరాలలో జలవిద్యుత్తేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉండగా 30 వేలు దిగువకు వదులుతున్నారు. 101 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యాములో నిల్వ 60 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత ఇన్ ఫ్లో 1,11,566 క్యూసెక్కులు. ఎగువ నుంచి వరద నీరు ఇదే విధంగా వస్తే నాలుగు రోజుల్లో తుంగభద్ర పూర్తిగా నిండుతుంది. మరో పక్క నిజామాబాద్ లో గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో మళ్లీ పెరుగుతోంది. 90 టీఎంసీల ఈ రిజర్వాయర్ లో నీటి నిల్వ 76 టీఎంసీలకు చేరింది. మరో 48 గంటల్లో శ్రీరాంసాగర్ క్రెస్ట్ గేట్లను ఎత్తాల్సి రావచ్చు. కర్ణాటకలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున ఆగస్టు నెలాఖరు నాటికి నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం ఉంది. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి ఇన్ ఫ్లో తగ్గుతున్నా ఇంకా 6.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువన అనేక లంక గ్రామాలు గోదావరి వరద నీటితో చిత్తడిగా మారాయి. రహదారులపై రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *