లండన్ : సహజంగా చనిపోయిన వారి భౌతిక కాయానికి అంత్య క్రియలు నిర్వహించేందుకు దహనం, ఖననం వంటి ఆయా సంప్రదాయ విధానాలు అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్‌ పద్ధతిలోనూ దహన సంస్కారాలు నిర్వహించే విధానం చాలా ప్రాంతాల్లో అమల్లో ఉంది.అయితే ప్రస్తుతం వీటికి భిన్నంగా సరికొత్త విధానం వైపు పలు దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలోనే ‘నీటితో అంత్యక్రియలు’ (రెసోమేషన్ )నిర్వహించే పర్యావరణ హితమైన విధానానికి బ్రిటన్‌ లో కూడా అనుమతించింది. ఎటువంటి కాలుష్యం లేని ఈ రెసోమేషన్‌ ను త్వరలోనే బ్రిటన్‌ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. నీటి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే పద్ధతినే రెసోమేషన్‌ అంటారు. దీనిలో ఎటువంటి మంటలు ఉండవు. పొటాషియం హైడ్రాక్సైడ్‌, నీటి సహాయంతో మృతదేహాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఇది. తొలుత మృతదేహాన్ని ఓ బయోడీగ్రేడబుల్‌ బ్యాగులో చుట్టి పెడతారు. అనంతరం 95శాతం నీరు, ఐదు శాతం పొటాషియం హైడ్రాక్సైడ్‌తో కూడిన వేడి ద్రావణమున్న కంటైనర్‌లో ఉంచుతారు. దీన్నే ‘బాయిల్‌ ఇన్‌ ది బ్యాగ్‌’గా వ్యవహరిస్తారు. రసాయన చర్య అనంతరం కొన్ని ద్రవాలు బయటకు రాగా, మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. ఈ పద్ధతి పూర్తికావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎటువంటి గాలి కాలుష్య కారకాలు, విషపూరిత వాయువులూ వెలువడవు. అక్వామేషన్‌ , ఆల్కలైన్‌ హైడ్రాలసిస్‌ అని కూడా పిలిచే ఈ ప్రక్రియను అత్యంత సురక్షిత విధానంగా పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని కెనడా, దక్షిణాఫ్రికాతోపాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా బ్రిటన్‌ కూడా ఈ పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *